ఓ వివాహిత ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నిర్మల్ పట్టణంలో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో వుంటున్న మహిళ బలవన్మరనానికి పాల్పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది. విడివిడిగా వున్నప్పటికి ఫోన్ లో భర్త సూటిపోటి మాటలు, వేధింపులు తట్టుకోలేకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన సోనికా రెడ్డి(31)కి, అదే జిల్లా తిమ్మాపూర్ కు చెందిన ఉదయ్ కిరణ్ రెడ్డితో 2006 సంవత్సరంలో పెళ్ళయింది. ఉదయ్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండటంతో భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడే ఓ ఇంట్లో అద్దెకుంటూ ఆనందంగా కొత్త సంసారాన్ని ప్రారంభించారు.

మొదట్లో సాఫీగా సాగిన వీరి సంసారం రానురాను రణరంగంగా మారింది. ప్రతి చిన్న విషయానికి భార్య భర్తల మధ్య గొడవలు జరగుతుండేవి. ఈ క్రమంలోనే కిరణ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య మళ్లీ తీవ్రమైన గొడవ జరగడంతో సోనికా రెడ్డి నిర్మల్ లోని పుట్టింటికి వచ్చింది. గతకొద్ది రోజులుగా నిర్మల్ లోనే ఉంటోంది. 

ఉదయ్ కిరణ్ భార్యకు తరచూ ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. ఆమెపై అనుమానం వ్యక్తం చేయడం, తీవ్రంగా దూషించడం చేసేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోనికా బలవన్మరణానికి పాల్పడింది. 

బుధవారం తెల్లవారుజామున తమ  బంధువులు నివాసముండే అపార్టమెంట్‌లోకి వెళ్లిన సోనికా....ఐదో అంతస్తుపై నుండి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ  ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు తమ అల్లుడి వేధింపుల కారణంగానే కూతురు ఆత్మహత్యకు పాల్పడించినట్లు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.