వాగు పక్కనే మహిళ డెలివరీ అయింది. వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాగు పక్కనే ఆ మహిళ డెలివరీ అయింది. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.  ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకొంది.


నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఓ నిండు గర్భిణీ వాగు సమీపంలోనే డెలీవరీ అయింది. వాగు ప్రవాహం తర్వాత గ్రామస్తులు ఆమెను వాగు దాటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడెం మండలం దత్తోజిపేట సమీపంలోని వాగు పొంగింది. ఈ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళకు పురిటినొప్పులొచ్చాయి. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఈ వాగును దాటాలి.

ఈ వాగు దాటే సమయానికి వాగులో వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో వాగును దాటలేక వాగుకు ఇటువైపే ఎల్లవ్వ సహా కుటుంబసభ్యులు వేచి ఉన్నారు. అయితే వాగు వద్ద నాలుగైదు గంటల పాటు అక్కడే గడిపారు. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు పక్కనే ఎల్లవ్వ ప్రసవించింది. ఆ తర్వాత వాగు ప్రవాహం తగ్గింది. గ్రామస్తులు జేసీబీ సహాయంతో బాలింతను వాగు దాటించారు. వాగు దాటిన తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేర్పించిన ఎల్లవ్వను, చిన్నారిని వైద్యులు పరీక్షించారు. ఇద్దరూ కూడ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.