ఖమ్మం నియోజకవర్గంలో మహాకూటమి తరపున పోటీకి  దిగిన టిడిపి సీనియర్ నాయకులు నామా నాగేశ్వరరావు నామినేషన్ తిరస్కరించాలంటూ ఓ మహిళ ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఆయన నామినేషన్ పత్రాల్లో తనపై వున్న వేధింపుల కేసు గురించి పేర్కొనలేదని...అందువల్ల అతడిని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఖమ్మం రాజకీయాల్లో కలకలం రేగింది.

మాజీ మంత్రి నామా నాగేశ్వరరావు తన పలుకుబడిని ఉపయోగించుకుని తనను లైంగికంగా వేధించాడని సుజాత అనే మహిళ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. నామా తన ఇంటికి వచ్చీ బెదిరించాడని,  మాట వినకుంటే తన వద్ద ఉన్న నగ్న చిత్రాలను బైటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడని జూబ్లీహిల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి కూడా.

తాను చేసిన ఫిర్యాదుతో నామాపై పోలీసులు కేసు నమోదు చేశారని సుజాత గుర్తు చేసారు. అయితే ఈ కేసు గురించి నామా తన నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని...ఇలా ఎన్నికల నిబంధనలను పాటించని అతడు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆమె తహశీల్దార్‌కు సమర్పించారు.