ఓ ఒంటరి మహిళ దారుణానికి తెగించింది. అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ దానికి అడ్డుగా ఉన్నాడని సొంత అక్క కొడుకునే హతమార్చింది. తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఆ బాలుడు చివరికి పిన్ని చేతుల్లోనే విగతజీవిగా మారాడు.

నిజామాబాద్ : రోజురోజుకూ మానవవిలువలు మృగ్యమైపోతున్నాయి. రక్తసంబంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా తన పంచన చేరిన.. అక్క కొడుకును, పెంచిన పాశం అని కూడా చూడకుండా తన అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని అతి దారుణంగా హతమార్చిందో పిన్ని. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. తన విషయాలన్నీ బాలుడికి తెలిసిపోతున్నాయని.. ఎక్కడైన బయటపెడతాడని భయపడిందో.. ఏమో కానీ అకారణంగా నిండుప్రాణాలు తీసేసింది. 

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని బాలుడిని హత్య చేసిన ఘటన మండలంలోని మేడిపల్లి జీపీ పరిధిలో గల హన్మంతు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మంతు తండాకు చెందిన జోగిని లక్ష్మి, తన అక్క కొడుకు రాజు(16)తో కలిసి ఉంటోంది. రాజు తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మృతి చెందారు. దీంతో రాజు తన చిన్నమ్మ లక్ష్మి దగ్గర ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. 

సీతాయి పల్లి గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో బాలుడు తనకు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బాలుడు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం ప్రియుడితో కలిసి బాలుడిని చీరతో ఉరివేసి హత్య చేసినట్లు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రామన్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న నిజామాబాద్ లోనే ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. తన కుమారుడి మరణానికి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ.. ఆమె కుమారుడిని హతమార్చి Revenge తీర్చుకున్న వైనమిది. nizamabadలో శుక్రవారం సిపి నాగరాజు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ లోని ఆటో నగర్కు చెందిన రుక్సానా బేగం, అస్లాం ఖాన్ కుమారుడు ఫైజల్ ఖాన్ 9 ఏళ్ల క్రితం గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త చెల్లెలు సనా బేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది.

ఈ క్రమంలో మార్చి 31న ఇంటిదగ్గర ఆడుకుంటున్న సనా బేగం కుమారుడు ఫయాజ్(7)ను ఆటోలో బోధన్ కు తీసుకువెళ్లి అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి.. తిరిగి ఆటోనగర్ కు చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. తాను వెతుకుతున్నట్లు వారిని నమ్మించింది. అదే రోజు రాత్రి మళ్ళీ బోధన్కు వెళ్ళిన రుక్సానా బేగం ఆ బాలుడిని హతమార్చింది. తరువాత నిజాం సాగర్ కొత్త కెనాల్ నీటిలో పడేసింది.

బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు బాలుడిని హత్య చేసింది.. తన మేనత్త రుక్సానా బేగం, మరో బాలిక అని తేల్చారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.