వైఎస్సార్ తెలంగాణ  పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీని  విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను సంప్రదించినట్టుగా ప్రచారం సాగుతుంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీని విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను సంప్రదించినట్టుగా ప్రచారం సాగుతుంది. వైఎస్సార్‌టీపీ వర్గాల నుంచి కూడా ఇదే రకమైన సమాచారం అందుతుంది. వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించడం సాధ్యం కాదని షర్మిలతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పినట్టుగా తెలుస్తోంది. 

అయితే ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పలు షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. తనకు పీసీసీ చీఫ్‌ పదవి ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని షర్మిల కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చెప్పినట్టుగా సమాచారం. ఒకవేళ అలా జరగని పక్షంలో.. తన పార్టీకి మంచి సీట్లు ఇస్తేనే కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరిస్తానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే ఖమ్మంలోని అన్ని సీట్లు, మహబూబ్‌నగర్‌లో మెజారిటీ సీట్లను ఆమె కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు, విలీనం కుదరని పక్షంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కలుపుకుని ముందుకు సాగాలని షర్మిల వ్యుహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏదైనా చేయాలని.. లేకుంటే త పార్టీనే కాకుండా, ప్రతిపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను ఆకర్షించడానికి షర్మిల ఎంట్రీ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు బలంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. 

షర్మిల చెబుతున్న మాటేమిటంటే.. 
అయితే తనకు ఇతర పార్టీల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని షర్మిల మంగళవారం మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేసే అవకాశం లేదని అన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని పార్టీల నుంచి తనకు పిలుపులు వస్తున్నాయని ఆమె చెప్పారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో తమ పార్టీ 43 సీట్లలో ప్రభావం చూపనున్నట్లు తేలిందని అన్నారు. ఇంత బలంగా ఉన్న తాము ఓ 10,20 సీట్ల కోసం పొత్తులకు పోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అదే సమయంలో.. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో తమకు ఇష్టం లేదని కామెంట్ చేశారు. అందుకే తాము ఎవరితోనైనా చర్చలకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.