Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ శపథాలు ఇవీ: అన్నీ పాటిస్తే మిగిలేది వైరాగ్యమే...

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. ఒకరు పంచ్ డైలాగులు పేలిస్తే మరోకరు హావా భావాలతో రెచ్చిపోతుంటారు. మరికొందరు నానా హంగామా చేస్తుంటారు. వీరందరిది ఒక స్టైల్ అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో స్టైల్. 

Will Uttam Kumar Reddy stick to his challenges?
Author
Hyderabad, First Published Dec 11, 2018, 2:41 PM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. ఒకరు పంచ్ డైలాగులు పేలిస్తే మరోకరు హావా భావాలతో రెచ్చిపోతుంటారు. మరికొందరు నానా హంగామా చేస్తుంటారు. వీరందరిది ఒక స్టైల్ అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో స్టైల్. 

ఉత్తమ్‌‌ స్టైల్ కాస్త డిఫరెంట్‌ అని చెప్పుకోవాలి. సినీ స్టైల్లో ఆవేశంగా పంచ్‌లు డైలాగులు పేల్చలేరు కానీ శపథాలు చెయ్యడంలో మాత్రం దిట్ట అనే చెప్పుకోవాలి. రోజుకో శపథం చేస్తూ రికార్డులు నెలకొల్పారు ఉత్తమ్.  

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీయ్యనని శపథం చేసిన ఉత్తమ్ అన్నట్లుగానే ఏడాది నుంచి గబురు గడ్డంతో కనబడుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ గెలిచినా ఓడినా తనదే బాధ్యత అంటూ ఉత్తమ్‌ ప్రకటించుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి నుంచి తప్పుకుంటారని, గాంధీభవన్ మొహం కూడా చూడనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అయితే ఉత్తమ్ ఆశలు ఆడియాసలు అవ్వడంతో ప్రస్తుతం ఆయన కిం కర్తవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముందస్తు ఎన్నికల్లో ఉత్తమ్ ఆశించిన ఫలితాలు రాలేదు. కారు జోరు ముందు ప్రజాకూటమి బేజార్ అవ్వడంతో ఉత్తమ్ ఏం చెయ్యబోతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. గడ్డంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న సందేహం నెలకొంది. 

వాస్తవానికి ఉత్తమ్ అలా శపథాలతో రెచ్చిపోవడానికి బలమైన కారణం కూడా ఉంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించారని అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ రిపోర్ట్ వచ్చిందంట. దీంతో ఉత్తమ్ ఒక రేంజ్ లో టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. 

అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో అయినా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తులలో ఆయన ఒకరు. ఎందుకంటే రథసారథి ఆయనే కాబట్టి. 

ఈ హామీలు సరిపోవన్నట్లు ఉత్తమ్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తనకు 50వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ 50వేల మెజారిటీ రాకపోతే గెలిచినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మరో సవాల్ విసిరారు. 
 
 ఆ రెండే కాదు తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓడిపోతే తాను గాంధీభవన్ లో అడుగుపెట్టబోనని మరో సవాల్ విసిరారు ఉత్తమ్. ఈ ఎన్నికలకు పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించుకున్నారు కూడా. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి లేదా కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.  

ప్రజాకూటమి ఓడిపోతే డిసెంబర్11 తర్వాత తాను గాంధీభవన్ లో అడుగుపెట్టేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాఫ్రంట్ గెలిచి తీరుతుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం శపథం జాతీయ స్థాయిలో కూడా ప్రాచూర్యం పొందింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకూ తను గడ్డం గీయించుకోనని ప్రకటించిన    ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం జాతీయ మీడియా వరకూ వెళ్లింది. ఇప్పటి వరకూ తెలంగాణ మీడియా వర్గాల్లోనూ, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. 

అటు ఉత్తమ్ గడ్డం వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గడ్డం పెంచుకొన్నవాళ్ళంతా గబ్బర్ సింగ్‌లు కాదంటూ విమర్శించారు. ఉత్తమ్ ఆ మాటకు కట్టుబడి ఉంటే, ఆయన గడ్డం అలా పెరిగిపోవాల్సిందే తప్ప మరో ప్రయోజనం ఉండదని కౌంటర్ ఇచ్చారు. 

మరి ఎన్నికల్లో ప్రజాకూటమి బోల్తాకొట్టడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం గీయించుకుంటారా లేక అలానే ఉంచుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా నెలకొంది. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. 

పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవి ఎలా ఉన్నా గడ్డం బరువును దించుకోవడానికి అయినా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. కానీ ఓటరు దేవుళ్లు మాత్రం కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాకూటమిని కానీ ఆదరించకపోవడంతో ఆయన శపథం నెరవేరలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios