వరంగల్: పరకాల నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి కొండా సురేఖకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆమె ఇప్పుడు పరకాల నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా ఆగ్రహించిన కొండా సురేఖ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. ఆమె ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ తరఫున ప్రస్తుతం ఆమె చల్లా ధర్మా రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి తరఫున పి. విజయచంద్రా రెడ్డి పోటీ చేస్తున్నారు. 

చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి గెంతారు. రెండోసారి విజయం సాధించాలని చల్లా ధర్మారెడ్డి ఉవ్విళ్లురుతున్నారు. 

నియోజకవర్గంలో మొత్తం లక్షా 98 వేల 297 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో బీసీలు 85 వేల పైచిలుకు ఉన్నారు. బీసీల ఓట్లు తనకే పడుతాయనే ధీమాతో కొండా సురేఖ ఉన్నారు. 2014 ఎన్నికల్లో లక్షా 63 వేల 855 ఓట్లు పోల్ కాగా, చల్లా ధర్మారెడ్డికి 67,432 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. సహోదర రెడ్డికి 58324 ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 30,283 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 

ఈసారి తెలుగుదేశం పార్టీ మద్దతు కాంగ్రెసుకు ఉంటుంది. అందువల్ల ధర్మారెడ్డిని ఢీకొనడం సులభమే అవుతుందని సురేఖ భావిస్తున్నారు. కాంగ్రెసు, టీడీపి ఓట్లను కలిపితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పోలైన ఓట్ల కన్నా ఎక్కువ వస్తాయనేది కొండా సురేఖ ధీమా. 

పరకాల పంచాయతీని పురపాలక సంఘంగా మార్చడం, రెవెన్యూ డివిజన్ ను తిరిగి సాధించడం తన విజయానికి దోహదం చేస్తాయని చల్లా ధర్మారెడ్డి విశ్వాసంతో ఉన్నారు. రూ.1200 కోట్లతో మెగా టెక్స్ టైల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడం, రూ.1500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, 120 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించడం తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. 

అయితే, పార్టీ సీనియర్లను దూరం పెట్టడం, కాంట్రాక్టులన్నీ తానే పొందాడనే ఆరోపణలు చల్లా ధర్మారెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయి ఉంది. 

ఈ స్థితిలో చల్లా ధర్మారెడ్డి తన కాంట్రాక్టు పనులను పెంచుకుని తాను లాభపడ్డారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదనే ప్రచారంతో కొండా సురేఖ ముందుకు సాగుతున్నారు. అది తన విజయానికి తోడ్పడుతుందని ఆమె నమ్ముతున్నారు. 

బీసీ మహిళా నాయకురాలు కావడం, పరకాలతో 15 ఏళ్ల అనుబంధం ఉండడం, కాంగ్రెసులో సీనియర్ నేత కావడం వల్ల మంత్రి అవుతారనే అభిప్రాయం బలంగా ఉండడం, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం కొండా సురేఖకు కలిసి వస్తాయని అంటున్నారు.

అయితే, గత ఐదేళ్లుగా పరకాల నియోజకవర్గానికి దూరంగా ఉండడం, ఎన్నికల సమయంలో పార్టీ మారడం వంటి కారణాలు ఆమెకు ప్రతికూలంగా పనిచేస్తాయని అంటున్నారు. అయితే, పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డికి, కొండా సురేఖకు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు.