Asianet News TeluguAsianet News Telugu

TTDP : ఇదెక్కడి ట్విస్ట్ ... తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా మల్లారెడ్డి..? 

బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సమయంలో మల్లారెడ్డిప గురించి ఓ ఆసక్తికర ప్రచారం తెలంగాణ రాజకీీయాల్లో సాగింది.

Will BRS leader Mallareddy join TDP? AKP
Author
First Published Jun 15, 2024, 3:32 PM IST

హైదరాబాద్ : మల్లారెడ్డి... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగానే కాదు మాజీ మంత్రిగా ప్రజలకు సుపరిచితం. సాధారణ పాలవ్యాపారిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం  ఈ స్థాయికి చేరుకోవడం చాలా గొప్పవిషయమే. కానీ ఆయన వ్యవహార తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. తన మాటలతో పొలిటికల్ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న మల్లారెడ్డి అసలు రూపం వేరే వుంటుందని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. బిఆర్ఎస్ అధికారంలో వున్నంతకాలం అతడు గొప్పోడిగానే చలామణి అయ్యారు... కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి అక్రమాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి దారి ఎటువైపు? అనేది ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా మల్లారెడ్డి..? 

గతంలో మల్లారెడ్డితో పాటు ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ సమయంలో ఇద్దరి మధ్యా మంచి సంబంధాలే వుండేవి. ఎప్పుడయితే మల్లారెడ్డి బిఆర్ఎస్ లో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారో  మిత్రులు కాస్త శత్రువులయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అవినీతిపరుడని, భూకబ్జాలకు పాల్పడినట్లు రేవంత్ ఆరోపణలు చేసాడు. వీటిని తిప్పికొట్టే క్రమంలో మల్లారెడ్డి కూడా రేవంత్ ను బ్లాక్ మెయిలర్, ఓటుకు నోటు దొంగ అనేవారు. ఇలా ఇద్దరిమధ్య దూరం పెరిగి ఒకరికొకరు సవాల్ విసురుకునే స్థాయికి చేరుకుంది. ఓ సందర్భంలో రేవంత్ ను బూతులు తిడుతూ  తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేసాడు మల్లారెడ్డి. 

అయితే ఇలా రేవంత్ రెడ్డితో పెంచుకున్న వైరం ఇప్పుడు మల్లారెడ్డికి ప్రాబ్లం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా వున్న రేవంత్ మాజీ మంత్రిని టార్గెట్ చేసారు... తన విద్యాసంస్థలు, హాస్పిటల్స్ తో పాటు ఇతర వ్యాపారాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్వయంగా మల్లారెడ్డే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆయనపై భూకబ్జా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి... దీంతో మల్లారెడ్డి అరెస్ట్ కు రేవంత్ స్కెచ్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక తనను కాపాడటం బిఆర్ఎస్ వల్లకాదు కాబట్టి పార్టీ మారే ఆలోచనలో వున్నారట మల్లారెడ్డి. 

ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చింది... తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇక తెలంగాణలోనూ టిడిపిని బలోపేతం చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ టిడిపి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో టిటిడిపి కొత్త అధ్యక్షుడిగా మల్లారెడ్డి పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డి నుండి తనను  కాపాడేది చంద్రబాబే అని నమ్ముతున్న మల్లారెడ్డి టిడిపిలో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే మల్లారెడ్డి టిడిపి చేరతారనేది కేవలం ప్రచారం మాత్రమే. అయితే నిజంగానే మల్లారెడ్డి టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు జరుపుతున్నా రేవంత్ అలా జరగనిస్తారా? చంద్రబాబుకు మల్లారెడ్డి కంటే రేవంతే దగ్గర... కాబట్టి అలా జరగనివ్వక  పోవచ్చు. ఒకవేళ తెలంగాణలో టిడిపిని తిరిగి బలోపేతం చేయాలని చంద్రబాబు గట్టిగా అనుకుంటే మాత్రం మల్లారెడ్డి ప్రయత్నాలు ఫలించవచ్చు. కానీ అప్పుడు చంద్రబాబు మాట రేవంత్ వినే పరిస్థితి వుండదు. 

కాంగ్రెస్, బిజెపిల వైపు మల్లారెడ్డి చూపు..: 

ఇక ఇప్పటికే మల్లారెడ్డి బిఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిహెచ్ఎంసి పరిధిలో  గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తోంది. ఇదే అదునుగా మల్లారెడ్డి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే  సీఎం రేవంత్ తనను కాంగ్రెస్ లోకి రానివ్వడని ఆయనకు తెలుసు... కాబట్టి జాతీయ స్థాయి నాయకులతో లాబీయింగ్ చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎంను మల్లారెడ్డిని కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇదే సమయంలో బిజెపి వైపు కూడా మల్లారెడ్డి చూస్తున్నారు. కేంద్రలో అధికారంలో వుంది కాబట్టి రేవంత్ బారినుండి  బయటపడాలంటే బిజెపిలో చేరడం మరో ఆప్షప్ గా మల్లారెడ్డి పెట్టుకున్నారు. ఇలా టిడిపి,కాంగ్రెస్, బిజెపిలో ఏదో ఒక పార్టీలో మల్లారెడ్డి చేరతారంటూ ప్రచారం జరుగుతోంంది.  

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios