హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన భర్త వేధింపులకు గురి చేయడంతో కుమారుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన వికారాబాద్  జిల్లాలో చోటు చేసుకొంది.

వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని గౌతంపూర్ లో  సోమవారం నాడు జరిగింది. బాలమణికి కొన్నేళ్ల క్రితం కొడంగల్ పట్టణానికి చెందిన మల్లేశంతో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత  స్వగ్రామంలో ఆస్తులను విక్రయించి అత్తిల్లు గౌతపూర్ కు వచ్చాడు. డ్రైవర్ గా పనిచేస్తూ  కుటుంబాన్ని  పోషిస్తున్నాడు. కొంతకాలంగా మల్లేశం జల్సాలకు అలవాటు పడ్డాడు.

పలు చోట్ల చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. సోమవారం నాడు ఇంటికి వచ్చిన మల్లేశం బంగారం ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.  మల్లేశం ఇంట్లోంచి బయటకు వస్తూ కిందపడ్డాడు. 

ఇదే అదనుగా తీసుకొన్న  భార్య , కొడుకులు బండరాళ్లతో కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. తలపై తీవ్ర గాయాలతో మల్లేశం అక్కడికక్కడే మరణించాడు. మల్లేశం వేధింపులు భరించలేక హత్య చేసినట్టుగా భార్య, కొడుకు పోలీసుల ముందు అంగీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాన్ని  తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.