హైదరాబాద్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. భర్త హత్యకు ప్రియుడి సహాయం తీసుకోవడంతో పాటు కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఈ నెల 13వ తేదీిన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా హత్యకు వాడిన మారుతి కారును, నాలుగు కత్తులను, ఒక్క గొడ్డలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్ారు. 

ఇల్లంతుకుంటకు చెందిన తిరుపతి టెంట్ హౌస్ తో పాటు డీజె సౌండ్ నిర్వహిస్తుంటాడు. అతని వద్ద పనిచేసే కోదాడకు చెందిన సురేష్ ఈ హత్యలో కీలక పాత్ర నిర్వహించినట్లు తెలుస్తోంది. సురేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న తిరుపతి భార్య మమత ఈ హత్యలో పాలు పంచుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

సురేష్ తో మమత వివాహేతర సంబంధం పెట్టుకుందని, దాంతో భర్త తిరుపతి ఆమెను మందలించాడని, దాంతో పాటు సురేష్ ను పని నుంచి తీసేశాడని పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దాంతో తిరుపతిని అడ్డు తొలగించుకోవడానికి మమత పకడ్బందీ పథకం వేసినట్లు తెలుస్తోంది. 

కడపునొప్పి వస్తోందంటూ ఆర్థరాత్రి భర్త వద్ద డ్రామా ఆడింది. ఆ విషయం తెలియక అతను ఆమెను టూవీలర్ పై ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పూనుకున్నాడు. ఇద్దరు టూవీలర్ పై బయలుదేరారు. ఈ విషయాన్ని ముందుగానే ఆమె ప్రియుడికి చెప్పింది. దాంతో బస్వాపూర్ గ్రామ శివారులోకి వారు చేరుకోగానే సురేష్ రోడ్డుపై కారును అడ్డుపెట్టాడు. దాంతో అదుపు తప్పి టూవీలర్ పై నుంచి ఇద్దరు పడిపోయారు. 

కిందపడిన తిరుపతిపై సురేష్ తో పాటు ముగ్గురు కిరాయి హంతకులు కత్తులతో దాడి చేశారు. ఆ దాడిలో తిరుపతి మరణించాడని పోలీసులు కనిపెట్టినట్లు తెలుస్తోంది. తిరుపతి హత్యకు కిరాయి హంతకులతో రూ.45 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కిరాయి హంతకులను సూర్యాపేటకు చెందిన కనకయ్య, లింగయ్య, లక్ష్మణ్ లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.10 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. 

మారుతి 800 కారులో సురేష్ తో పాటు ముగ్గురు కిరాయి హంతకులు కత్తులు, గొడ్డళ్లు తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం మమత ఇచ్చిన సమాచారం మేరకే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. మమత తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట, కోదాడల్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.