తమ్ముళ్లతో కలిసి పథకం చేసి ఓ మహిళ.. కట్టుకున్న మొగుడినే పథకం ప్రకారం హత్య చేసింది. పండగకు పిలిచి మరీ దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కగూడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దిలాబాద్‌ పట్టణంలోని బొక్కలగూడలో నివాసం ఉంటున్న షేక్‌ ఆసీఫ్‌ (26)కు ఇద్దరు భార్యలున్నారు.మొదటి భార్య సదాది కిన్వట్‌. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అనంతరం షేక్ ఆసీఫ్.. ఫిర్దోస్ అనే యువతిని  రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. 

గత కొంతకాలంగా ఫిర్దోస్, ఆసీఫ్‌ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యను వదిలిపెట్టి తనతో ఉండాలని ఫిర్దోస్‌ ఆసీఫ్‌తో గొడవ పడుతుండేది. పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సైతం ఈ విషయంలో గతంలో కేసు నమోదయింది. సోమవారం బక్రీద్‌ను పురస్కరించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో షేక్‌ ఆసీఫ్‌ బావమరుదులు సలీం, షారూఖ్‌ ఇంటికి పిలిచారు. మొదటి భార్యను వదిలేసి తమ సోదరితో కలిసి ఉండాలని కోరారు.

ఈ తరుణంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు బావమరుదులు ఆసీఫ్‌ను తీవ్రంగా కొట్టి, కత్తెరతో గుండెలో పొడిచారు. రక్తం మడుగులో ఆసీఫ్‌ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్థానికులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.