అక్రమసంబంధానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తమ అక్రమ  బంధానికి  అడ్డుగా వున్నాడని ఓ  వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్నవాన్ని కడతేర్చింది. ఈ  హత్యను సాధారణ మరణంగా అందరిని నమ్మించడానికి ప్రయత్నించి విఫలమై ప్రియుడితో కలిసి చివరకు కటకటాలపాలయ్యింది.  

ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా  వైరా పట్టణంలో జరిగింది. పట్టణంలో నివాసముండే షేక్ అబ్దుల్, హమీదా లు భార్యాభర్తలు. అబ్దుల్ ఎలక్ట్రీషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా పనిలో బిజీగా వుంటూ అబ్దుల్ నిత్యం బయటే వుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా వుండే అతడి  భార్య హమీదా తప్పుడుపనులకు దిగింది. పక్కింట్లో  వుండే షేక్ అక్బర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. 

అయితే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన అబ్దుల్ ఆమె అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. దీంతో భార్యతో పాటు ఆమె ప్రియుడు అక్బర్‌కు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.  

తమ గుట్టురట్టవడంతో ఇకనుంచి కలుసుకోవడం  కుదరదని భావించిన హమీదా,అక్బర్ లు దారుణమైన ప్లాన్ వేశారు. అబ్దుల్ అడ్డు తొలగించుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వీరు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం...అబ్దుల్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హమీదా,అక్బర్ లు కలిసి అతడి గొంతునులిమి హత్య చేసింది. 

అనంతరం ఈ హత్యను సాధారణ హత్యగా చిత్రీకరించేందుకు హమీదా ఓ కట్టుకథ అల్లింది. తన భర్త మూర్చవ్యాధితో మృతిచెందినట్లు ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అతడి గొంతపై గాయాలుండటాన్ని  గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్య హమీదాను తమ శైలిలో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఆమె ప్రియుడు అక్బర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.