మంచిర్యాలలో ఓ మిరాకిల్ జరిగింది. భర్త చనిపోయిన 11 నెలలకు ఓ భార్య.. అదే భర్త ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. భర్త వీర్యంతో ఆధునిక వైద్యవిధానం ద్వారా ఇది సాధ్యమయ్యింది.  

వరంగల్ : తల్లి కావాలని తపించిన ఓ మహిళ భర్త మరణించిన 11 నెలలకు ఆధునిక వైద్య విధానంతో మాతృత్వాన్ని పొందింది. 2013లో పెళ్లయిన మంచిర్యాలకు చెందిన ఓ జంటకు ఏడేళ్లు అయినా పిల్లలు పుట్టలేదు. వీరు వరంగల్లోని ఓయాసిస్ Fertility Centerలో 2020నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యభర్తల నుంచి అండం, Semen సేకరించి భద్రపరిచారు. కరోనాతో 2021లో భర్త చనిపోయాడు. 

పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే జీవిత భాగస్వామి మరణించడంతో 32 ఏళ్ల ఆ మహిళ కుంగిపోయింది. మరో పెళ్లి చేసుకోకుండా అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆస్పత్రిలో భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా బిడ్డను కని మాతృత్వపు మాధుర్యం చవిచూడాలని భావించింది. అదే విషయాన్ని అత్తమామలకు వివరించింది. వారు అంగీకరించడంతో వైద్య నిపుణులను సంప్రదించింది. అయితే, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా హైకోర్టుకు వెళ్ళింది. 

కోర్టు సైతం ఆ మహిళ ఇష్టానికి వదిలివేయడంతో దంపతుల నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యం ద్వారా ఆగస్టు 2021లో ఆసుపత్రి నిపుణులు ఐవిఎఫ్ చికిత్స ప్రారంభించారు. ఇది సఫలం కావడంతో. ఈ ఏడాది మార్చి 22న పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చింది. ఆస్పత్రి క్లినికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్య రావు మాట్లాడుతూ 16 రోజుల బాబును చూపిస్తూ తల్లి కావాలని ఆ స్త్రీ పడిన తపన, ఆమెకు అండగా నిలిచిన అత్తమామల గొప్పదనాన్ని వివరించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూలై21న అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో ఓ యువతి భర్త వీర్యాన్ని తనకు అందించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. సదరు భర్త కోవిడ్ సోకి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ యువతి, అత్తామామలతో కలిసి కోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది. ఆమె భర్త 29యేళ్ల వ్యక్తి కోవిడ్ తో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. అతను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడు. ఒక్కరోజుకు మించి అతను బతికే అవకాశం లేదని డాక్టర్ తెలిపారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. 

అతను చనిపోయినా అతని పిల్లలకు తల్లిగా మారాలని తాను కోరుకుంటున్నానని అందుకే.. అతని వీర్యాన్ని భద్రపరిచి తనకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె హైకోర్టును కోరారు. దీనికి ఆమె అత్తామామలు మద్దతు పలికారు. ఈ పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు వడోదర ఆసుపత్రికి యువతి కోరిన విధంగా మరణిస్తున్న కోవిడ్ -19 రోగి స్పెర్మ్‌ను భద్రపరచాలని ఆదేశించింది. అయితే రోగి దీనికి అంగీకరించే పరిస్థితిలో లేనందు వల్ల ఆసుపత్రి వర్గాలు మొదట్లో ఆమె అభ్యర్థనను తిరస్కరించారు.

కోవిడ్ తో అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని, అనేక అవయవాలు దెబ్బతిన్నాయని, వెంటిలెటర్ మీద ఉన్నాడని అంతేకాదు, పెండింగ్‌లో ఉన్న అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం వ్యక్తి అనుమతి లేకుండా స్పెర్మ్ పొందలేమని వారు తెలిపారు. దీనికోసం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావాల్సి ఉంటుందని వారు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి భార్య, తల్లిదండ్రులు తమ ఫ్యామిలీ లాయర్ ద్వారా కోర్టులో ప్లియా వేసింది. కాగా, సదరు భర్త కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే ప్రాణాలు వదిలాడు.