అవసరానికి అప్పు చేసింది.. ఆ తరువాత అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అంతే భర్త అడ్డుగా కనిపించాడు.. ఇంకేముంది ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం.. మర్డర్ ప్లాన్ చేసి హతమర్చింది. అయితే.. 

మహబూబ్ నగర్ : అప్పు తీసుకున్న సందర్భంగా మహిళతో extramarital affair ఏర్పడింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడం కోసం అతను అమలు చేసిన ప్రణాళిక ఓ క్రైం సినిమాను తలపిస్తుంది. Mahabubnagar డి ఎస్ పి కిషన్ శుక్రవారం జడ్చర్లలో విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండలం బూరుగుపల్లికి చెందిన శ్రీశైలం (29)కి తొమ్మిదేళ్ల కిందట హైదరాబాదులోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన సంగీతతో వివాహం అయ్యింది. ఈమె తల్లి నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గ్రామానికి చెందిన వెంకటమ్మ. ఆమె సుమారు 20 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వెళ్లి జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది.

2016లో శ్రీశైలం జీవనోపాధి కోసం భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి హైదరాబాద్ కు వెళ్ళాడు. ఎల్బినగర్ రత్నానగర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కారు డ్రైవర్ గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య సంగీత ఎదురింట్లో ఉండే విక్రమ్ వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకుంది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన శ్రీశైలం మందలించినా భార్య ప్రవర్తన లో మార్పు రాకపోవడంతో.. కుటుంబాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు.

స్నేహితుడిని బంధువుగా పంపి…
సంగీత దగ్గర ఫోన్ లేకపోవడంతో సంబంధాన్ని కొనసాగించడం కోసం.. ఆమె సహకారంతో విక్రమ్ తన స్నేహితుడు రాజును ఆమె దూరపు బంధువుగా నాలుగు నెలల కిందట వారి ఇంట్లో మకాం వేయించాడు. అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రియురాలి సహాయంతో ఆమె భర్త శ్రీశైలంను హతమార్చాలని పథకం పన్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇనుప రాడ్తో చేయించాడు. గత నెల 31న ప్రత్యేకంగా ఒక ద్విచక్ర వాహనాన్ని, కొత్త దుస్తులను కొన్నాడు.

దుకాణ యజమాని ఫోన్ తోనే తన స్నేహితుడైన రాజుకు ఫోన్ చేసి.. సంగీత తల్లి వెంకటమ్మ రూ. 50 వేలు ఇచ్చి పంపించిందని, ఊరి బయట ఉన్నానని వచ్చి తీసుకు వెళ్లాల్సిందిగా శ్రీశైలంను నమ్మించి తీసుకురావాలని చెప్పాడు. శ్రీశైలం అతని వెంట ఊరి బయటకు వచ్చి మద్యం తాగుతుండగా.. విక్రమ్ తరువాత అక్కడికి చేరుకున్నాడు. శ్రీశైలం కళ్లల్లో కారం చల్లి.. ప్రత్యేకంగా చేయించిన ఇనుప రాడ్తుతో తలపై మోది హతమార్చాడు. ఆ తరువాత రాజు తిరిగి బూరుగుపల్లికి వెళ్ళిపోయాడు. విక్రం ద్విచక్రవాహనంపై హైదరాబాద్కి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన శ్రీశైలం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అతడి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. సంగీత, వారి ఇంట్లో ఉంటున్న రాజుపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు విక్రమ్, హత్య కుట్రకు సహకరించిన సంగీత తల్లి వెంకటమ్మ శుక్రవారం జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి దగ్గర ఉండగా అదుపులోకి తీసుకొని విచారించామని, హత్య కేసును ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు. నిందితులు నలుగురిని రిమాండ్ కు తరలించారు అని చెప్పారు. సిఐలు రమేష్ బాబు, జమ్ములప్ప, ఎస్సైలు రాజేందర్, విజయ ప్రసాద్, సిబ్బంది బాలు,శంకర్, రమేష్ ఈ కేసులో పాల్గొన్నారు.