తెలంగాణలోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గం, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన సెగ్మెంట్, కోట్లు కుమ్మరించగల అభ్యర్థులు, ఒకరికి కేసీఆర్, మరోకరికి చంద్రబాబుల అండదండలు, సెటిలర్లకు అడ్డా... ఇన్ని విశేషాలను సొంతం చేసుకున్న నియోజకవర్గం శేరీలింగంపల్లి.

తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిగా చర్చించుకంటున్న ఈ స్థానంపై చర్చ నడుస్తోంది. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన అరికెపూడి గాంధీ 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.

తాజా ఎన్నికల్లో అదే స్థానం నుంచి కారు గుర్తుపై గాంధీ పోటీ చేస్తుండగా.. భవ్య సిమెంట్స్ అధినేత, నిర్మాత భవ్య ఆనందప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. హైటెక్ సిటీతో పాటు, ఖరీదైన కాలనీలు, సంపన్న వర్గాలుండే శేరిలింగంపల్లిలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్‌తో పాటు అనుకూలమైన సామాజికవర్గం నేతలు అధిక సంఖ్యలో ఉన్నారు.

టీడీపీ హయాంలోనే సైబరాబాద్, హైటెక్ సిటీ, న్యాక్ లాంటి ఉపాధి కల్పన సంస్థలు కొలువుదీరాయి.. దీంతో నగరానికి విసిరేసినట్లుగా ఉండే శేరిలింగంపల్లికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. రియల్ బూమ్‌తో భూముల ధరలు పెరిగాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు సీమాంధ్రులు అత్యధిక సంఖ్యలో ఉండటం భవ్య ఆనందప్రసాద్‌కి కలిసొచ్చే అంశం.

అయితే నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడం, క్యాడర్, నేతలతో సమన్వయం చేసుకోలేకపోవడంతో పాటు నియోజవర్గంలోని డివిజన్లన్నింటిలో టీఆర్‌ఎస్ కార్పోరేటర్లు ఉండటం ఆయనకు ప్రతికూలంశంగా మారింది.

ఇక టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ విషయానికొస్తే.. అధికార పార్టీ పెద్దల అండదండలతో రూ.4 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అందరినీ కలుపుకోయే వ్యక్తిగా పేరుండటం ఆయనకి కలిసొచ్చే అంశం. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ నేతలు గాంధీపై మండిపడుతున్నారు.

పార్టీకి ద్రోహం చేసిన గాంధీని ఎలాగైనా ఓడించాలనే గట్టిపట్టుదలతో వారంతా ఉన్నారు. దీనికి తోడు టీఆర్ఎస్‌కు ఇక్కడ బలమైన క్యాడర్ లేకపోవడం అరికెపూడిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ నిర్ణయాత్మక ఓటుగా ఉన్న సీమాంధ్రులు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే వారే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. దీంతో గెలుపెవరిది అంటూ కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి.