హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మరో రాష్ట్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తేలా ఉందన్నారు. మరోవైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ మారలేదన్న భట్టి విక్రమార్క వారందరినీ ఒక గ్రూపుగా ఎలా పరిగణిస్తారని స్పీకర్ ని నిలదీశారు. 

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎప్పటికప్పుడు అనర్హత పిటీషన్లు ఇచ్చామని ఏనాడు పట్టించుకోలేదన్నారు. తాము ఇచ్చిన అనర్హత పిటీషన్లపై చర్యలు తీసుకోని స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. సీఎల్పీ విలీనంపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయింస్తామని స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగింది  కాంగ్రెస్ సంక్షోభం కాదని రాజ్యాంగ సంక్షోభమని వ్యాఖ్యానించారు. ఇకపోతే సీఎల్పీ కార్యాలయానికి విజిటర్స్ ను అనుమతించకపోవడంపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేసి తాను సీఎల్పీ నేతగా ఉండగా విజిటర్స్ ను ఎందుకు రానీయడం లేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.