హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగానే ముందుకు వెళ్తామని జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన తర్వాత ఆదివారం నాడు రాత్రి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు.ఈ నిర్ణయంపై ఆర్టీసీ జేఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం అప్రజాస్వామికంగా ఉందన్నారు. సమస్యకు పరిష్కారం చూపకపోగా ఇంకా సమస్యను పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జేఎసీ కన్వీనర్ ఆశ్వథామ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని జేఎసీ నేతలు గుర్తు చేశారు. పక్క రాష్ట్రాన్ని చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని ఆశ్వథామరెడ్డి హితవు పలికారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. 

ఆర్టీసీని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చట్టబద్దంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై న్యాయపరంగానే ముందుకు వెళ్తామని ఆశ్వథామరెడ్డి చెప్పారు.కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేఎసీ కన్వీనర్ ఆశ్వథామ రెడ్డి ప్రకటించారు.

కార్మికులు పోరాటానికి సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు ఆర్టీసీకి మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆశ్వథామరెడ్డి గుర్తు చేశారు.