తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోవడానికి వీలులేదంటూ యువతిని బెదిరించాడు. చివరకు ఆ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన నిజాంపేట మండలం రాంపూర్ లో బుధవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాంపూర్ గ్రామానికి చెందిన జల్ల నర్సింలు గౌడ్(30) బుధవారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా అతనిపై కొందరు వ్యక్తులు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. గాయపడిన నర్సింహులు గౌడ్ ను రామాయంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 

కాగా.. నర్సింహులు గౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని గత కొన్నేళ్లుగా ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచి ప్రేమించాలంటూ, పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. గతేడాది నిజాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

ప్రస్తుతం పద్దెనిమిదేళ్ల ఆ యువతికి తల్లిదండ్రులు వివాహం చేయాలని భావించి సంబంధాలు చూస్తున్నారు. యువతిని, తల్లిదండ్రులను తరచుగా బెదిరిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. 

ఈ క్రమంలో సదరు యువతి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతనిపై దాడి చేసి మరీ కొట్టారు. తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు.