శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు తెలిపారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతున్నారన్న సభలో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు రేవంత్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్ ను నిర్భందించారని, ఆక్ష్న ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై  న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఇందులో భాగంగా ఆరోజు రేవంత్ ని అరెస్టు చేయడానికి గల కారణాలను వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ  వివరించారు. రేవంత్ ని అరెస్టు చేయడానికి ముందు బయటకు రావాలని రేవంత్ ని పలుమార్లు పిలిచామని.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గేట్లు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్ తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని.. వారికి రేవంత్ అరెస్ట్ కు దారితీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు పెట్టాలని కోరగా వారు నిరాకరించారని ఆమె తెలిపారు.