హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య మలుపులు తిరుగుతోంది. వ్యాపార లావాదేవీలలో వచ్చిన మనస్పర్థల కారణంగానే రాంప్రసాద్‌ను మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం హత్య చేయించారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

నెల రోజులుగా రాంప్రసాద్‌కు కోగంటి సత్యం నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనకు రావాల్సిన సుమారు రూ. 50 కోట్ల వాటా ఇవ్వట్లేదని కోగంటి సత్యంపై గతంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రాంప్రసాద్ ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు.

శనివారం రాత్రి హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ప్రస్తుతం హత్యారోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం పదిరోజులుగా ఆజ్ఞాతంలో ఉన్నారు.

వీరిద్దరు విజయవాడలో కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో వ్యాపారం నిర్వహించారు. వ్యాపార లావాదేవీలలో మనస్పర్థలు రావడంతో గతంలో సైతం రాంప్రసాద్‌పై కోగంటి రెండు సార్లు హత్యాయత్నం చేయించినట్లుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

బెజవాడలో రక్షణ లేదని భావించిన మృతుడు 2005 నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటుచేసి సత్యం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.