హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారక కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ టీడీపీలోని పరిణామాలు తెలంగాణలోని టీఆర్ఎస్ కు తప్పనిసరి భవిష్యత్ సంకేతంగా ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె రెండు ప్రాంతీయ పార్టీలు సమర్థవంతమైనవి అయితే జాతీయ పార్టీలకు స్థానం దొరక్కపోవచ్చునన్నది ఎంత వాస్తవమో, రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే ప్రాంతీయ పార్టీలకు ఆయా  రాష్ట్రాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవమన్నారు.

కేసీఆర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. మూడు తరాల నుంచి డీఎంకే, ఏఐడీఎంకేలు అనుసరిస్తున్న ఈ గుణాత్మకరాజకీయ విధానాన్ని అర్థం చేసుకోకుండా ఆ సాంస్కృతి, సమున్నత ప్రాంతీయ ఆత్మగౌరవ వ్యవస్థను నిర్మించకుండా డీఎంకే, ఏఐడీఎంకే అనుకుంటూ కేవలం ప్రసంగాలతో  కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ప్రస్తుతం దేశంలోని పార్టీల ఫిరాయింపు సమస్య మెుత్తం ఆ పార్టీల కొన్ని నిర్ణయాల తప్పిదమన్నారు. సిద్ధాంత విధానాల కోసం కార్యకర్తలకు బదులు వ్యాపార నిర్బంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవులు నియామకంలో స్థానం కల్పిండం వల్ల ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు. టీడీపీ, టీఆర్ఎస్ లు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చాయని ఆమె ఆరోపించారు.