తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబు కారణం కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన సంగతి తెలసిందే. కాగా.. ఈ విషయంపై శుక్రవారం ఉత్తమ్ స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని.. ఓటమిపై సమీక్షించుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆయన ఆరోపించారు. ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్న నియోజకవర్గాల్లోనూ వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కపెట్టలేదని మండిపడ్డారు. 

ఎన్నికల్లో చోటుచేసుకున్న ఇలాంటి తప్పులను రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. పొత్తుల వల్ల ఓడిపోయామనేది సరికాదని.. కాకపోతే పొత్తు  నిర్ణయం కాస్త త్వరగా తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

సీఎం ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవటం, అసెంబ్లీని సమావేశపరచకపోవటం దారుణమని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌ చెప్పారు.