హైదరాబాద్: తమ పార్టీ సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వవద్దని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దానిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పీసీసీపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డికి సూచించారు. అందుకు జగ్గారెడ్డి సమ్మతించారు.

పిసీసీ మార్పుపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పీసీసీ మార్పుపై ఎవరూ మాట్లాడవద్దని ఆయన ఆదేశించారు. సరైన సమయంలో పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇకపై పీసీసీ మార్పు మీద తాను మాట్లాడనని జగ్గారెడ్డి చెప్పారు.  

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని, రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇవ్వవద్దని జగ్గారెడ్డి అన్నారు. రాజకీయంగా తనపై కక్ష సాధింపు చర్యలకు దిగితే తన కూతురు జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకుని వస్తానని ఆయన చెప్పారు. లాక్ డౌన్ ముగియడంతో తమ పార్టీలో మళ్లీ రాజకీయాలు ప్రారంభమయ్యాయని, పీసీసీ అధ్యక్షుడి మార్పుపై మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

నేనంటే నేను అని 20 మంది చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.  టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని తాను రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తనను అడగకుండా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకు ఉంటుందని, కొత్త ఆలోచన సైతం ఉందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిని తప్పించి ఎవరికి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ ను బాధ్యుడిని చేయడం సరి కాదని జగ్గారెడ్డి అన్నారు. ఆ విషయానికి వస్తే అందరినీ గెలిపిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారని ఆయన అన్నారు. దానికి ఏం సమాధానం చెబుతారని ఆయన అడిగారు. కాంగ్రెసులో చాలా మంది కోవర్టులున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులపై ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు రాత్రిపూట కర్ఫ్యూను డిసెంబర్ వరకు పొడగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.