న్యూఢిల్లీ: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాలో మెుక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతోపాటు ఆయన అనుచరులు దాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 

ఎఫ్ఆర్వో అనితపై దాడి ప్రస్తావన అంశం రాజ్యసభలో ప్రస్తావించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఎఫ్ఆర్వో దాడికి సంబంధించి ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. 

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ శాఖను సంరక్షిస్తున్న అధికారులపై ఇలా పాశవికంగా దాడికి పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారుల దాడిపై  అటవీశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 

అరణ్యభవన్ లో అటవీశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఎఫ్ఆర్ వో అనితపై దాడికి పాల్పడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. అలాగే కొందరు రాజకీయ నేతలు అధికారులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తమకు ఆయుధాలు ఇవ్వాలని సీఎస్ ను కోరనున్నట్లు తెలుస్తోంది.