ఢిల్లీ‌: కేంద్రబడ్జెట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందనడానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి సాయం ప్రకటించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, నిరుద్యోగం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రోత్సాహం అందించే పథకాలను ప్రవేశపెట్టడంలో కేంద్రం విఫలమైంని ఆరోపించారు.  

ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.1 పన్ను చెల్లిస్తే తిరిగి రూ.2 చెల్లిస్తున్నారని.. బిహార్‌ రూ.1 పన్ను ఇస్తే తిరిగి రూ.1 ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని ఇదెక్కడి అన్యాయం అంటూ ప్రశ్నించారు. 

ఆదాయపన్నులో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మే అని నిర్ధారణ అయ్యిందని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.