రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో... ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడింది.. కొన్ని భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ దారుణ సంఘటన  సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కంది మండల గణేష్ గడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మహిళ శరీర భాగాలు ముక్కలుగా తెగి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దృశ్యం అత్యంత జుగుప్సాకరంగా మారింది. 

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా... చనిపోయిన మహిళ ఎవరు..? ఆమెను ఢీ కొన్న వాహనం ఏది? హత్య? ప్రమాదమా అన్న కోణంలో  పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.