హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్ ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మహిళల ప్రాతినిథ్యం ఉండబోతుందన్నారు. 

జరగబోయే కేబినేట్ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ కేబినేట్ లో మహిళలకు మంత్రి పదవులు దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా మహిళలకు కేబినేట్ లో స్థానం కల్పించలేదు. 

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వవిప్ గా సునీతలను నియమించారు. వీరితోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇచ్చినప్పటికీ మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ముందస్తు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని ఆయుధంగా తీసుకుని ప్రచారం చేశారు. ఈసారి అలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలకు కేబినేట్ లో అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. 

కేసీఆర్ కేబినేట్ లో మంత్రులుగా మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి రేఖానాయక్ లకు అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన కేబినేట్ విస్తరణలోనే పద్మాదేవేందర్ రెడ్డికి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ దక్కలేదు. ఈసారి మాత్రం పక్కా అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.