Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్ డాక్టర్లు.. తెలంగాణలో తొలిసారిగా..

తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ డాక్టర్లు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం ద్వారా సరికొత్త చరిత్రను లిఖించారు. 

Two transgender doctors get government jobs in telangana
Author
First Published Nov 29, 2022, 10:45 AM IST

తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ డాక్టర్లు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం ద్వారా సరికొత్త చరిత్రను లిఖించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులుగా వీరు నిలిచారు. వీరిద్దరు ప్రభుత్వ ఆధీనంలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వీరిద్దరూ వైద్యాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పెద్ద చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. 

అయితే ఇది అంతా సాధారణంగా జరిగిపోలేదు.. దీనికి ముందు వారు ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డాక్టర్ రూత్ జాన్ పాల్ కొయ్యాల 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు హైదరాబాద్‌లోని 15 హాస్పిటల్స్ ఉద్యోగాన్ని తిరస్కరించాయి. ట్రాన్స్‌జెండర్ కావడం తమ వద్దకు వచ్చే పెషేంట్లను తగ్గిస్తుందని ఒక ప్రైవేట్ హాస్పిటల్  డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ను తొలగించింది.

‘‘ఇది నాకు.. నా కమ్యూనిటీకి చాలా గొప్ప రోజు. నేను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటి నుంచి హైదరాబాద్‌లోని కనీసం 15 ఆసుపత్రులచే తిరస్కరించబడ్డాను. ఇది నా గుర్తింపు కారణంగా అని వారు నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది’’ అని డాక్టర్ రూత్ చెప్పారు. తన గుర్తింపు బయటపడినప్పుడు.. ఎంబీబీఎస్ డిగ్రీ, అర్హత ఆసుపత్రులకు సంబంధం లేకుండా పోయిందని అన్నారు. ఖమ్మం చెందిన రూత్.. మల్లా రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్వ విద్యార్థి. 

డాక్టర్ ప్రాచీ ఆదిలాబాద్‌లోని రిమ్స్ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని పొందారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తూనే తాను లింగమార్పిడి చేయించుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి.. తనను ఉద్యోగం విడిచిపెట్టమని అడిగారని.. ఇది వారికి పెషేంట్లను రాకుండా నిరోధిస్తుందని చెప్పారని ప్రాచీ తెలిపారు. 

ఇక, అనేక తిరస్కరణల తర్వాత.. వీరిద్దరు జీవనోపాధి కోసం 2021లో నారాయణగూడలోని యూఎష్‌ఏఐడీ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ఎంఐటీఆర్‌లో చేరారు. కానీ వారు సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీలు చేయించుకున్న సమయం కాబట్టి.. ఉద్యోగాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే తాజాగా వీరిద్దరు ప్రభుత్వ ఉద్యోగం పొందారు. దీనిపై ఆ కమ్యూనిటీకి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే వారిద్దరు వారి ప్రయాణంలో గొప్ప ముందడుగే వేసినట్టుగా చెప్పాలి. ప్రస్తుతానికి వారికి దక్కిన అవకాశం గొప్పదైనప్పటికీ.. వారు ఇకముందు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కూడా ఒక్కోసారి వివక్ష చూపే రోగులు ఉన్నారని వారు చెప్పారు. అయితే ఒకసారి వారికి చికిత్స అందించినప్పుడు వారు కోలుకుంటే.. వారే ఇతరులను తమ వద్దకు పంపుతారని రూత్ అన్నారు. తమకు ఇంకా కొన్ని పోరాటాలు ఉన్నాయని ఆ ఇద్దరు డాక్టర్లు చెప్పారు. 

‘‘మేమిద్దరం ట్రాన్స్ ఉమెన్‌గా మా నీట్ పీజీ పరీక్షలు రాశాం. కానీ రిజర్వ్‌డ్ సీట్లు రాలేదు. ఎందుకంటే ఇది.. థర్డ్ జెండర్‌ను గుర్తించి, సంస్థలు, ఉద్యోగాలలో ప్రవేశాలలో రిజర్వేషన్‌ను మంజూరు చేసే 2014 నాటి సుప్రీంకోర్టు NALSA తీర్పుకు విరుద్ధం. వాస్తవానికి రాష్ట్ర కౌన్సెలింగ్ జాబితా మమ్మల్ని మహిళాగా వర్గీకరించింది. మేము దీనిపై ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ సమర్పించాము. అవసరమైతే చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకుంటాం’’ అని ప్రాచీ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios