అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను ఇంట్లోకి తీసుకువెళ్లి... ఓకేసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చిర్రకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చిర్ర కుంట గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన నైతం జ్ఞానేశ్వర్‌ వారి వద్దకు వచ్చాడు. చిన్నారులతో మాటలు కలిపి, వారి పెద్దలు పనికి వెళ్లారని తెలుసుకున్నాడు. వారిలో ఓ చిన్నారి ఇంట్లోకి ఇద్దరినీ తీసుకెళ్లి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

పని ముగించుకుని ఇంటికి వచ్చిన ఓ బాలిక తండ్రి ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన జ్ఞానేశ్వర్‌ ఒక్కసారిగా బాలిక తండ్రిని పక్కకు తోసేసి పారిపోయాడు. జరిగింది బాలికలను అడిగి తెలుసుకుని వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికలపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. దీంతో జ్ఞానేశ్వర్‌పై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.