తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణను ఒక రాష్ట్రంగా కాక ప్రత్యేక దేశంగా ఫీలవుతూ కేసీఆర్ పరిపాలన కొనసాగించారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజలు ఆయనను రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే.. ఆయన దానిని తన కుటుంబసభ్యులకు అన్వయించుకున్నారని రమణ ఆరోపించారు. నాలుగు కోట్లమంది ప్రజల నమ్మకాన్ని సీఎం వమ్ము చేశారని ఆయన దుయ్యబట్టారు. శాసనసభ్యులకు, మంత్రులకు చివరకు తనను ఎన్నకున్న జనానికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ శ్రేయస్సు కోరి అన్ని పార్టీలతో చర్చించి ప్రజాకూటమిగా ఏర్పడ్డామని.. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించామన్నారు. బీజేపీ, ఎంఐఎంతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని రమణ ఆరోపించారు.  ఇసుక మాఫియాకు టీఆర్ఎస్ నేతలు అండగా నిలిచారని.. కుటుంబ పెత్తనాన్ని ప్రజలపై రుద్దారని రమణ విమర్శించారు.