ఆర్టీసీ రూట్లను ప్రైవేటు చేస్తే ఓ ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల జేఏసీ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ.. 2 కోట్ల 31 లక్షల అప్పు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాలకు ఏయిర్ బస్ పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని రావుల సెటైర్లు వేశారు.

1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధమని.. ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన హితవు పలికారు. ఆర్టీసీపై కేసీఆర్ ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపిస్తున్నారని.. కర్రుకాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికులు ధైర్యంకోల్పోకుండా పోరాటం చేయాలని.. ఏ పోరాటం చేసినా తెలుగుదేశం ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఆయన హామీ ఇచ్చారు. సమ్మె తో ప్రజారవాణ బాగుపడుతుందన్న సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి కార్మికులకు సూచించారు.