Asianet News TeluguAsianet News Telugu

 'హైదరాబాద్ దర్శిని' స‌ర్వీసుల‌ను ప్రారంభించిన ఆర్టీసీ.. కేవలం రూ.250తో సిటీ మొత్తం చుట్టేయొచ్చు..

హైదరాబాద్ లోని ప‌ర్య‌ట‌క ప్ర‌దేశాల‌ను ద‌ర్శించడానికి వ‌చ్చే యాత్రికుల కోసం టిఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ "హైదరాబాద్ దర్శిని" పేరిట రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించారు.

TSRTC Hyderabad Darshan will tour you around city in 12 hours
Author
First Published Oct 13, 2022, 2:44 PM IST

హైదరాబాద్ లోని ప‌ర్య‌ట‌క ప్ర‌దేశాల‌ను ద‌ర్శించడానికి వ‌చ్చే యాత్రికుల కోసం టిఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ "హైదరాబాద్ దర్శిని" పేరిట రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించారు. నగ‌రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల‌నే ఉద్దేశ్యంతో ఆర్టీసీ సంస్థ నేరుగా నగ‌రంలోని పర్యటక, చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ బస్సు సర్వీసులను నడపడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ నగర టూరిస్టులకు అనుకూలంగా  ఆర్టీసీ "హైదరాబాద్ దర్శిని" బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింద‌ని తెలియజేశారు. ఈ స‌ర్వీసులను ఉప‌యోగించుకుని యాత్రికులు నగరంలోని ప‌ర్య‌ట‌క‌, చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా షెడ్యూల్ సిద్ధం చేశారు.

తొలుత ఈ బస్సు సర్వీసులు వారాంతంలో (శనివారం, ఆదివారం) సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభ‌మ‌వుతాయనీ, వీటికి మంచి ఆదరణ వ‌స్తే.. మిగతా రోజుల్లో కూడా స‌ర్వీసుల‌ను న‌డుపుతామ‌ని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్  తెలిపారు. టిఎస్ఆర్టిసి సంస్థను ప్రజలందరూ ఆదరించాల‌ని,ఈ సంస్థ ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తుందని తెలిపారు.

"హైదరాబాద్ దర్శిని" బ‌స్సు స‌ర్వీసు వివ‌రాలిలా..!!

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బస్సు సర్వీసులు అందుబాటు ఉంటుంది.  

1. బిర్లా మందిర్ దేవస్థానం దర్శనం..   ఉద‌యం 9:00 నుండి 10:00 వరకు. 
2 .చౌల్ మహల్ ప్యాలెస్ సందర్శన.     ఉద‌యం10:30 నుండి 12: 30 వరకు.
3. తారామతి బారదరి రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం. 1:00 నుండి 1:45 వరకు.
4. గోల్కొండ కోట సందర్శన..             మ‌ధ్యాహ్నం 2:00 నుండి 3:30 వరకు.
5. దుర్గం చెరువు పార్క్ సందర్శన..   మ‌ధ్యాహ్నం 4:00 నుండి 5:00 వరకు.
6. కేబుల్ బ్రిడ్జ్ సందర్శన..                సాయంత్రం 5:30 నుండి 6:00 వరకు.
7. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ సందర్శన.. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు.

పర్యటక, చారిత్రక ప్రాంతాలను వీక్షించిన అనంతరం తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు రాత్రి 8.00 చేర్చడం జరుగుతుంది.

టిఎస్ఆర్టిసి మెట్రో ఎక్స్ప్రెస్.
1. పెద్దలకు 250 రూపాయలు.
2. పిల్లలకు 130 రూపాయలు.

 టీఎస్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ A/C
1. పెద్దలకు 450 రూపాయలు.
2. పిల్లలకు 340 రూపాయలు.

టిఎస్ఆర్టిసి మెట్రో ఎక్స్ ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 తీసుకుంటారు. అదే మెట్రో లగ్జరీలో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 చార్జీ చేయ‌నున్నారు. టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్ వెబ్ సైట్ www.tsrtconline.in లోకి వెళ్లి సంద‌ర్శ‌కులు త‌న‌ టూర్ బుక్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. లేదా 040-23450033, 040-69440000 హెల్ప్ లైన్ నంబర్లు ఫోన్ చేసి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న అద్భుతమైన అవకాశాలను విద్యార్థులు, విద్యాసంస్థ‌ల‌ యాజమాన్యాలు, ప్రకృతి ప్రేమికులు, విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios