వికారాబాద్‌లో భారీ వర్షం: మోమిన్‌పేట ఆర్‌ఓబీ వద్ద చిక్కుకున్న ఆర్టీసీ బస్సు, ప్రయాణీకులు సురక్షితం
వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో వర్షం నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని ప్రయాణీకులను స్థానికులు బయటకు తీశారు.
వికారాబాద్: జిల్లాలోని మోమిన్ పేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దీంతో ఆర్టీసీ బస్సు నుండి ప్రయాణీకులను బయటకు తీశారు. రెండు రోజులుగా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మోమిన్ పేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వర్షం నీరు చేరింది. అయితే వర్షం నీటి నుండి అవతలికి వెళ్లేందుకు బస్సును ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. అయితే వర్షం నీరు ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ బస్సు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులోకి వర్షం నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు తాళ్ల సహాయంతో బస్సు నుండి ప్రయాణీకులను బయటకు తీసుకు వచ్చారు.
గతంలో కూడ తెలుగు రాష్ట్రాల్లో కూడ భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సులు వర్షం నీటిలో నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3వ తేదీన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గోదావరిఖనిలోని ఫైవ్ ఇంక్లైన్ కాలనీలోని రైల్వే బ్రిడ్జిలో వర్షం నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. 20 మంది ప్రయాణీకులతో భూపాలపల్లి నుండి గోదావరిఖనికి ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బస్సు నుండి ప్రయాణీకులను కిందకు దించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వర్షం నీటిలో చిక్కుకున్న ఘటన 2020 ఆగస్టు 16న చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని రఘుపతిపేట వద్ద వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సు నుండి ప్రయాణీకులు బయటకు దిగారు. లింగాల, తెలకపల్లి, కల్వకుర్తి మీదుగా ఆర్టీసీ బస్సు హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుండి బస్సులోని ప్రయాణీకులు సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.