దాదాపు ఆరేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో దర్శనాలు పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో భక్తుల తాకిడి బాగా పెరిగే అవకాశం వున్నందున ఇందుకు అనుగుణంగా టీఎస్ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
యాదాద్రి (Yadadri) పుణ్యక్షేత్రంలో దర్శనాలు పునఃప్రారంభమవడంతో భక్తుల తాకిడి పెరగనుంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) (tsrtc) సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి గుట్టకు ఈ బస్సులు నడవనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
యాదాద్రి దర్శిని (Yadadri darshini) పేరుతో ఈ ఆర్టీసీ మినీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే యాదగిరిగుట్టకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సుల ఛార్జీలనూ సైతం ఆర్టీసీ తెలియజేసింది. జేబీఎస్ నుంచి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలను ఛార్జీగా నిర్ణయించారు. ఇతర జిల్లాల నుంచి కూడా యాదాద్రి క్షేత్రానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.
మరోవైపు.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి (yadadri lakshmi narasimha swamy temple) దర్శనాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారంతాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. భక్తుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ (bajireddy govardhan0 తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సులను ఎర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
కాగా.. యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవ వేడుక సోమవారం వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా సాగింది. ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. రాజగోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ (kcr) ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసిన వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అదే సమయంలో ఆలయంలోని ఇతర గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహాప్రాణన్యాసం చేశారు. తొలి ఆరాధన సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో స్వయంభువుల దర్శనం ప్రారంభం అయింది. లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేసీఆర్ దంపతులను శాలువాతో సత్కరించారు. వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
