ఖమ్మం కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు: డ్రైవర్ సజీవ దహనం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వద్ద కెమికల్ ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో ట్రక్కులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ ట్రక్కులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సూర్యాపేట వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో సర్వీస్ రోడ్డుపై నుండి వాహనాల రాకపోకలను అనుమతించారు పోలీసులు. ఫైరింజన్లతో ట్రక్కులో మంటలను ఆర్పివేశారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడ దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లు సజీవ దహనమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
సుల్తానాబాద్ నుండి బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీని వెనుక నుండి మరో వాహనం ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఫరియాజ్ చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. లారీ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఈ ఏడాది ఆగస్టు 27న చోటు చేసుకుంది.
హైద్రాబాద్ బీఎన్‌రెడ్డి నగర్ లో అంబులెన్స్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డీజీల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.ఈ ఘటన ఈ ఏడాది జూలై 25న చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలం దామవరం జాతీయ రహదారిపై లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో వంటకు ఉపయోగించే చిన్న సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఓ లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన చోటు చేసుకుంది.
గత ఏడాది జూన్ 6వ తేదీన సాలూరులో నిలిపి ఉన్న లారీలో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో లారీలో ఉన్న డ్రైవర్ కు మంటలు అంటుకుని అతను సజీవ దహనమయ్యాడు.