వరంగల్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న కేటీఆర్ వరంగల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఆ జిల్లా నేతలు. 

కేటీఆర్ పాల్గొనబోయే సభా వేదికలతోపాటు కేటీఆర్ ప్రారంభించనున్న పార్టీ కార్యాలయ స్థలాన్ని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇతర ఎమ్మెల్యేలు పరిశీలించారు. మంగళవారం హన్మకొండలోని బాలసముద్రంలో శంకుస్థాపన చేయనున్న వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయ స్థలాన్ని , కెడిసి కాలేజీలో సభ వేదికను కడియం శ్రీహరి పరిశీలించారు. అలాగే కార్యకర్తల సమావేశం కోసం జనగామలోని ప్రిస్టన్ గ్రౌండ్స్ ని కడియం శ్రీహరి పరిశీలించారు. 

టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటిఆర్ తొలిసారిగా ఈ నెల 20న వరంగల్ జిల్లాకు రానున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామా జిల్లాల్లో పరిధిలోని  కార్యకర్తల సమావేశంలో పార్టీ పటిష్టత, రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. 

యువకుడు, ఉత్సాహవంతుడు, పరిణితి చెందిన నాయకుడు కేటిఆర్ ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కి కడియం ధన్యవాదాలు తెలిపారు.   సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, పార్టీని పటిష్టం చేసి రానున్న పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు బాటలో తీసుకెళ్లేందుకు సమర్థుడైన కెటిఆర్ కు బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. కేటీఆర్ వల్ల పార్టీ మరింత పటిష్టం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. 


మొదటినుంచి ఓరుగల్లు టిఆరెఎస్ పార్టీ వెంట నడిచిందని అన్ని సందర్భాల్లో కేసీఆర్ కు అండగా నిలిచిందని కడియం గుర్తు చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఈ జిల్లా ప్రజలు టి.ఆర్.ఎస్ పార్టీకే పట్టం కట్టారని గుర్తు చేశారు. 

పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రావడం ఎంతో సంతోషకరమన్నారు. 

ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు జనగామా జిల్లాలోని ప్రిస్టన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగామ నియోజక వర్గాల ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

జనగామ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పెంబర్తి కాకతీయ కళాతోరణం నుంచి ప్రిస్టన్ గ్రౌండ్స్ వరకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలకాలని వరంగల్ జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 
అర్భన్ జిల్లా పార్టీ కార్యాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 

ఆ తర్వాత కెడిసి మైదానంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజక వర్గాల పార్టీ కార్యకర్తల ఉమ్మడి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్ధేశనం చేస్తారు.