ఢిల్లీ: ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు, నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు జమిలి ఎన్నికలు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న కేటీఆర్ జమిలి ఎన్నికల ద్వారా పాలన కుంటుపడకుండా ఉంటుందన్నారు. లేకపోతే దఫాలుగా ఎన్నికల నిర్వహణతో కోడ్ అమల్లో ఉండి పాలన కుంటుపడుతోందని చెప్పుకొచ్చారు కేటీఆర్. 

జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఆహ్వానించామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనే విషయాన్ని ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నాలుగుగంటలపాటు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగిందన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తుండటం, మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ, జమిలి ఎన్నికలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఏమున్నా టీఆర్ఎస్ దాన్ని ఆహ్వానిస్తుందన్నారు. 

పరిమిత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని సూచించామని ఒకేసారి ఎన్నికలతో ప్రజలు కూడా ప్రభుత్వ ఫలాలను అనుభవించే వీలుంటుందని తన అభిప్రాయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. జమిలి ఎన్నికల విషయంలో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు. 

దేశవ్యాప్తంగా అధికార వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం అంశాలను రాష్ట్రాలకు బదలాయించాలని కోరినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 150 పాఠశాలలు, 150 ఆస్పత్రులు, 150 గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఒక సూచన కూడా చేసినట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మోదీ ప్రతిపాదనకు జై కొట్టిన సీఎం జగన్, కేటీఆర్: జమిలి ఎన్నికలకు మద్దతు