పెద్దపల్లి: టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జి.వివేక్ కు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందా..?సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారా..?వివేక్ పై సొంతపార్టీ నేతలే అక్కసు వెళ్లగక్కడానికి గల కారణాలేంటి..?అన్న వినోద్ ప్రభావం ఇప్పుడు తమ్ముడిపై చూపనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జి.వివేక్ కుటుంబంతోపాటు పెద్దపల్లి లోక్ సభ పరిధిలో కూడా రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేక్ సోదరుడు వినోద్ కు టిక్కెట్ దక్కకపోవడంతో ఇరువురు పార్టీ వీడతారంటూ ప్రచారం జరిగింది. 

అంతేకాదు వినోద్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే వినోద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

వినోద్ టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగడం, వివేక్ ఎటు వెళ్లాలో తెలియక మౌనంగా ఉండిపోవడం ఆఖరిలో తప్పదు అన్నట్లుగా ప్రచారానికి వెళ్లడం టీఆర్ఎస్ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.

ఫలితంగా పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రాజకీయం రోజురోజుకు రంగులు మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ రెండు సెగ్మెంట్లలో ఓటమి పాలవ్వగా, ధర్మపురిలో సీనియర్‌ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్‌ అతి కష్టంగా విజయం సాధించారు. 

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అందుకు బలమైన శక్తులు పనిచేశాయంటూ పరాజయం పాలైన ఎమ్మెల్యేలతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ జి.వివేక్‌ లోక్‌సభ పరిధిలో ఫలితాలను శాసించేందుకు యత్నించి తమకు దెబ్బకొట్టారంటూ ఆరోపిస్తున్నారు.  

ధర్మపురి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వివేక్‌పై బాహాటంగానే విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు వివేక్‌ వర్గీయులు రూ.3 కోట్లు ఖర్చు చేశారని, వివేక్‌ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. 

బెల్లంపల్లి నుంచి తన సోదరుడు వినోద్‌ను బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దింపి, తమ నేతను ఓడించేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారని చిన్నయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో వివేక్‌ ఆఖరులో మాత్రమే ప్రచారానికి వచ్చారని బాల్క సుమన్‌ అనుచరులు విమర్శించారు. 

రామగుండంలో టీఆర్ఎస్ రెబెల్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌కు వివేక్‌ వర్గీయులు మద్ధతుగా నిలిచినట్లు సోమారపు సత్యనారాయణ అనుచరులు ఆరోపిస్తున్నారు. వివేక్‌ కారణంగా భారీ మెజారిటీ కోల్పోయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అనుచరులు చెప్తున్నారు. 

మంథనిలో పుట్టా మధు కోసం వివేక్‌ ప్రచారం చేసినా, ఫలితమివ్వలేదని ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఐదు సెగ్మెంట్లలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరుల్లో వివేక్‌ పట్ల అసంతృప్తి వెల్లువెత్తుతుంది. దీంతో పెద్దపల్లి ఎంపీ సీటుపై సందిగ్ధం నెలకొంది. వివేక్‌కు లోక్‌సభ సీటిస్తే ఒప్పుకునేది లేదని సగానికి పైగా ఎమ్మెల్యేలు పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు పంపిస్తున్నారు.