హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వచ్చే లోకసభ ఎన్నికల్లోనూ అదే ఫలితాలను రాబడుతుందని  సి ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ లోకసభ ఎన్నికల్లో స్వీప్ చేస్తుందని అంచనా వేసింది. 

సీ ఓటర్ సర్వే ప్రకారం ... తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుంది. అసదుద్దీన్ నేతృత్వంలోని మజ్లీస్ హైదరాబాదు సీటును తిరిగి కైవసం చేసుకుంటుంది.

టీఆర్ఎస్ కు లోకసభ ఎన్నికల్లోచ 42.4 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే అంచనా వేసింది.  ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 119 స్థానాల్లో 88 స్థానాలను గెలుచుకుని విజయ కేతనం ఎగురవేసింది. 

తెలుగుదేశం, సిపిఐ, టీజెఎస్ లతో కలిసి కూటమి కట్టినప్పటికీ కాంగ్రెసు 19 సీట్లకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు 21 సీట్లను గెలుచుకుంది. టీడీపికి రెండు సీట్లు దక్కాయి. మిగతా రెండు పార్టీలు ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాయి.