హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంతోష్ కుమార్, మహ్మద్ సలీం పదవీకాలం పూర్తి కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 

ఈ ఏడాది మార్చి 12 వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతోంది. మార్చి 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

తెలంగాణ అసెంబ్లీలో నామినేటేడ్ ఎమ్మెల్యేతో కలుపుకొంటే 120 మంది సభ్యులున్నారు. టీఆర్ఎస్‌కు 88 మంది ఎమ్మెల్యేలున్నారు. టీఆర్ఎస్ కు మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతును ప్రకటించారు. టీఆర్ఎస్ కు మిత్రపక్షం ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 97కు చేరుతోంది. 

ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకోవాలంటే కనీసం 24 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోవాలంటే కనీసం 24 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు టీడీపీ మద్దతిస్తే 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.

అయితే వ్యూహత్మకంగా ఓట్లు వేయించుకొంటే ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడ టీఆర్ఎస్ కైవసం చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిచ్చినా ఒక్క ఎమ్మెల్సీ పదవి దక్కాలన్నా కనీసం మరో మూడు ఎమ్మెల్యే బలం అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే మరో మూడ ఎమ్మెల్సీ పదవులకు కూడ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో పూర్తి కానుంది. దీంతో త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.