తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ లు తప్పడంలేదు. ఇటీవలే ఈ పార్టీ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వక్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుండి ఇంకా తేరుకోక ముందే మరో కీలక నాయకుడు టీఆర్ఎస్ పార్టీని వీడాడు. అత్యంత ప్రతిష్టాత్మక పోటీ జరుగుతున్న హైదరాబాద్ లోని ఓ కీలక నియోజకవర్గానికి ఇంచార్జిగా వ్యవహరించిన నాయకుడు పార్టీకి రాజీనామా చేయడం టీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలనట్లయింది. 

కూకట్ పల్లి  నియోజకవర్గ ఇంచార్జి గొట్టిముక్కల పద్మారావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు పంపించినట్లు పేర్కొన్నాడు. అయితే రాజీనామాకు గల కారణాలను మాత్రం అతడు వెల్లడించలేదు. 

2014 లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గొట్టిముక్కల పోటీ చేసి ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి  అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సీటు తనకే వస్తుందని భావించాడు. అయితే కేసీఆర్ మాత్రం సిట్టింగ్ లకు మళ్లీ అవకాశం కల్పించడంతో ఇతడికి నిరాశ తప్పలేదు. దీంతో గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇలా కీలక సమయంలో పార్టీకి రాజీనామా చేయడం టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపుతోంది. తాను ఏ పార్టీలో చేరేది గొట్టిముక్కల ఇంకా ప్రకటించలేదు.

టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో కూకట్ పల్లి ముఖ్యమైనది. ఇక్కడ  టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ  కూతురు  సుహాసినిని టిడిపి తరపున బరిలోకి దింపి ఏపి సీఎం చంద్రబాబు తెలంగాణలో తన ప్రాభల్యాన్ని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా కూకట్ పల్లిలో గెలిచి సుహాసినిని ఓడిస్తే చంద్రబాబు ఓడించినట్లేనని భావిస్తోంది.. దీంతో ఈ నియోజకవర్గంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో కేటీఆర్ ఇటీవలే వారితో సమావేశమై వారి పలు హామీలిచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో గొట్టిముక్కల రాజీనామా చేయడం టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.