ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కోసం పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేయనున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్్ రెడ్డి ప్రకటించారు. మరో రెండు మూడు నెలల్లోనే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయిస్తామని ఆయన ప్రకటించారు. 

శనివారం మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి నిలువెత్తు బంగారం(బెల్లం) తో అమ్మవార్లకు మొక్కు చెల్లించుకున్నారు. 

ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ...దేశంలోనే కాదు ఆసియా ఖండంలోను అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర ప్రసిద్ది చెందిందని గుర్తుచేశారు. ఇలాంటి జాతరకు ప్రత్యేకమైన గుర్తింపు తీసురావాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందన్నారు. అందుకోసం పార్లమెంట్ సాక్షిగా ఎంపీలమంతా పోరాటం చేసి అతి త్వరలో మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవార్లకు కోరుకున్నట్లు ఎంపీలు తెలిపారు. ఆయన్ని చల్లగా చూడాలని...అప్పుడూ ప్రజలు కూడా చల్లగా వుంటారని కోరుకున్నట్లు తెలిపారు.