హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోసమే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. 2006లోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అయితే పరిస్థితులు అనుకూలించలేదని తెలిపారు. 

ఇకపోతే కేంద్రంలో రెండు పార్టీలే అధికారాలు చెలాయిస్తున్నాయని వినోద్ ఆరోపించారు. యూపీఏ లేదంటే ఎన్డీయేదే అధికారం అన్న ఆయన ఆ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే ఫెడరల్ ఫ్రంట్ కి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంచేశారు. 

కాంగ్రెస్, బీజేపీలు ఎవరు విఫలమైనా తమకే అవకాశం దక్కుతుందని భావిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంగా ఉందని, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉందని చెప్పుకొచ్చారు. 

అధికార పార్టీ విఫలమైతే తమదే అధికారమని ఆ రెండు పార్టీలూ ఎదురుచూశాయన్నారు. కాంగ్రెస్‌, కాదంటే బీజేపీ ఇవి మాత్రమే దేశంలో అధికారంలోకి వచ్చేవని గుర్తు చేశారు. ఈ పరిస్థితితో ప్రజలకు ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని వినోద్ అభిప్రాయపడ్డారు.  

ప్రజాస్వామ్యంలో ఉన్నవి రెండు పార్టీలు మాత్రమేకాదని అనేక పార్టీలు ఉన్నాయన్నారు. ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యల పరిష్కరంలో కాంగ్రెస్‌, బీజేపీలు విఫలమయ్యాయని అందువల్లే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని చెప్పారు. 

కాంగ్రెస్‌,టీడీపీ విఫలమైంనందు వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారని చెప్పారు. దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసమే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన చేశారన్నారు.  

ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి అన్న విశేష ఆదరణ లభిస్తోందన్నారు. దాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న ఆయన ప్రాంతీయ పార్టీల అండతో జాతీయ పార్టీలు అధికారం చెలాయిస్తున్నాయని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఉన్నందునే సమస్యలు పరిష్కారం కావడంలేదని ఎంపీ వినోద్ అభిప్రాయపడ్డారు.