మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ బోయినిపల్లి వినోద్ తప్పుబట్టారు. చిందంబరం ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటికి ఆయనకు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేదని చెప్పడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పుల జాబితాను పరిశీలిస్తే అందులో తెలంగాణ 13వ స్థానంలో ఉందని...ఈ విషయాన్ని చిదంబరం గుర్తించి ఆరోపణలు చేస్తే బాగుండేదని వినోద్ అన్నారు. 

చిదంబరం టీఆర్ఎస్‌ పాలనపై , ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని వినోద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందనే చిదంబరం ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ అప్పులు 2 లక్షల 20 కోట్ల రూపాయలు దాటాయని చిదంబరం మాట్లాడటం ఆర్థిక పరమైన విషయాలపై ఆయన అవగాహనలేమిని సూచిస్తాయని పేర్కొన్నారు.

 రాష్ట్రాలు అప్పులు తేవడానికి కేంద్రం కొన్ని నిబంధనలు విధించిందని...రాష్ట్ర జీడీపీలో 25 శాతానికి లోబడి అప్పులు తెచ్చుకోవచ్చని తెలిపారు. అయితే తెలంగాణ చేసిన అప్పులు 22 శాతం కూడా దాటలేదని...ఎఫ్ఆర్‌బిఎమ్ చట్టానికి లోబడి తెలంగాణ అప్పులు చేస్తోందని వినోద్ వివరించారు. తెచ్చిన అప్పులను తెలంగాణ కు ఉపయోగపడే రంగాల పైనే వెచ్చిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ కేపిటల్ వ్యయంతో పొలిస్తే తెలంగాణ కేపిటల్ వ్యయంలో ముందుందన్నారు.  

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలతో కూడిన ఓ లేఖను రాసి చిదంబరానికి పంపించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలను చిదంబరం ఉపసంహరించుకోవాలి వినోద్ సూచించారు.