చంద్రబాబుని ఓడించేందుకు తమ పార్టీ ఎంపీలంతా ఏపీలో ప్రాచారం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సీతారాం నాయక్ స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే కేటీఆర్.. జగన్ ని కలిశారని చెప్పారు. ఇందులో ఇంకే విషయాలు లేవన్నారు.

తమ ఫెడరల్ ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందన్న దాంట్లో నిజం లేదన్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలన్న నినాదాన్ని ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పారని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా ఇప్పటికి కేసీఆర్ చాలా మందిని కలిశారని.. అదేవిధంగా జగన్ ని కూడా కలిశారని చెప్పారు. 

జగన్ ఏమైనా అంటరానివాడా? ఆయన ఓ ప్రతిపక్ష నేత అని ఆయన తెలిపారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీకి ఎందుకింత ఉలికిపాటో  అర్థం కావడం లేదన్నారు.  తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించలేదా? అని సీతారాం నాయక్ అన్నారు.