మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈటలపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య అవసరమనుకుంటే ఆ చర్య తీసుకుంటారని స్పష్టం చేశారు. 40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నామని ఈటల స్వయంగా ఒప్పుకున్నారని పల్లా తెలిపారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను కలిశానని అంటున్న ఈటల.. ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈటల రాజేందర్ బహుజనవాదం, వామపక్షవాదం ఎక్కడ పోయిందని ఆయన నిలదీశారు. ఈటల మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటని రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈటల ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నారని రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Also Read:జేపీ నడ్డాతో ఈటల భేటీ: బీజేపీలో చేరికపై చర్చ

దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు తెలంగాణలో అమ‌ల‌వుతున్నాయి కాబ‌ట్టే.. ప్ర‌తి ఎన్నిక‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌లు అద్భుత‌మైన విజ‌యం ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ వ్య‌వ‌సాయ రంగం దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచింద‌న్నారు. ఒక్క వానా కాలంలోనే ఒక కోటి 50 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను సాగు చేశామని.. ఈ ఏడాది కూడా సాగు చేయ‌బోతున్నాం. పెండింగ్ ప్రాజెక్టుల‌తో పాటు కొత్త ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్నామన్నారు. రాష్ర్టంలోని ప్ర‌తీ చెరువు ఎండాకాలంలోనూ నీటితో క‌ళ‌క‌ళ‌లాడాయని.. సాగునీరు అందుబాటులో ఉండ‌టంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.