క్యాసినో కేసులో ఈడీ విచారణ:టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్:క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ శుక్రవారంనాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆయన సిబ్బంది.క్యాసినో కేసులో ఈడీ విచారణకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం నోటీసులు పంపారు.ఈ నోటీసులు అందుకున్న ఎల్. రమణ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశాలకు వెళ్లిన టూర్ల వివరాలతో పాటు బ్యాంకు స్టేట్ మెంట్లతో ఎల్. రమణ ఈడీ విచారణకు హజరయ్యారు. విచారణ జరుగుతున్న సమయంలో ఎల్. రమణకు బీపీ డౌన్ అయింది. దీంతో వెంటనే ఆయనను కారులో ఆసుపత్రికి తరలించారు. గన్ మెన్ చేయిపట్టుకొని ఈడీ కార్యాలయం నుండి కారు వద్దకు తీసుకెళ్లారు.
క్యాసినో కేసు విచారణను ఈడీ అధికారులు మరింత వేగవంతం చేశారు.ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నారు. మూడు రోజుల నుండి ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నారు. మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని ధర్మేంద్ర యాదవ్, తలసాని మహేష్ యాదవ్ లను ఆడీ అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం ఎల్. రమణ విచారణకు హాజరయ్యారు.ఈడీ విచారణకు వచ్చిన సమయంలో మెట్ల ద్వారా మూడో అంతస్థుకి వెళ్లారు.మూడో అంతస్థులోకి వెళ్లడానికి లిఫ్్ కూడా ఉంది. లిఫ్ట్ లో కాకుండా మెట్ల ద్వారా వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లగానే ఆయన మంచినీళ్లు అడిగారు. అదే సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
also read:క్యాసినో కేసు: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ .రమణ
ఇటీవలనే ఎమ్మెల్సీ రమణకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయనను ఎక్కువ దూరం నడవవద్దని వైద్యులు సూచించారు. అయితే ఏకంగా ఆయన మూడు ఫ్లోర్ మెట్లు ఎక్కడంతో అస్వస్థతకు గురైనట్టుగా భావిస్తున్నారు. ఈడీ అధికారులు ఆయనను తొలుత హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తన వ్యక్తిగత వైద్యులు యశోదలో ఉన్నట్టుగా రమణ చెప్పడంతో అపోలో నుండి యశోద ఆసుపత్రికి తరలించారు. యశోదలో రమణను చేర్పించిన తర్వాత ఈడీ అధికారులు తమ కార్యాలయానికి వెళ్లారు.ఎల్. రమణ ఆరోగ్యంపై యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారు.