తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్ చేపడితే బాగుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర బాధ్యతలన్నీ కేటీఆర్ చేపట్టాలని.. కేసీఆర్.. కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాక్షించారు. 60ఏళ్లుగా దోపిడికి గురైన తెలంగాణను అభివృద్ధి చేయడానికి కేసీఆర్.. బడ్జెట్ డిజైన్ చేశారన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మనసు పెట్టి బడ్జెట్ తయారు చేయలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కొత్తగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా తయారు కావడం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండి దిగుబడులు పెరిగాయని వివరించారు.

అప్పులు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఉత్తమ్ కుమార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు అందడం లేదా అని ప్రశ్నించారు.