తెలంగాణ అటవీ శాఖ అధికారులపై ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. పోడుభూముల వ్యవహారంలో ఆయనకు అటవీ శాఖ అధికారులకు మధ్య వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అధికారుల తీరును తప్పుబడుతూ సోషల్‌ మీడియా వేదికగా కాంతారావు అక్కసు వెళ్లగక్కారు. ఆదివాసులని రెచ్చగొట్టొద్దని, మాటలు తగ్గించుకుంటే మంచిదని తక్షణమే కందకాలు తవ్వడం ఆపేయాలంటూ ఆయన పోస్ట్‌ పెట్టారు.

ఫారెస్ట్‌ అధికారుల తీరును విమర్శించిన ఆదివాసీలు నేడు గుండాల మండలం, శంభునిగూడెంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారికి మద్ధతుగా నిలిచిన ఎమ్మెల్యే.. ఆదివాసీ యువకులు గ్రామానికొక్కరు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

ఈ క్రమంలో పోలీసుల తీరుపై కూడా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే పోరు తగ్గదు ఏస్సై గారు.. విసిరిన బంతి అదే వేగంతో తిరిగి వస్తుందని గతాన్ని మర్చిపోయావా అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.

కాగా కొన్నాళ్లుగా పోడు భూములకు సంబందించి అటవిశాఖ అధికారులకు, ఆదివాసులకు మద్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. పోడు భూములలో అటవిశాఖ అధికారులు కందకాలు తోవ్వడాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఏన్నో ఏళ్ల నుంచి పోడు భూములలో వ్యవసాయం చేస్తున్నామని ఇప్పుడు కందకాలు తోవ్వితే ఎలా అంటూ అధికారులపై ఆదివాసులు మండిపడుతున్నారు.