పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామున్ని బీజేపీ రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. రామున్ని రాజకీయంలోకి లాగి అపవిత్రం చేస్తున్నారని ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

అయోధ్య పేరుతో దొంగ బుక్కులు పట్టుకుని చందాలు వసూళ్లు చేస్తున్నారని చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. అయోధ్య విరాళాలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పటేల్ విగ్రహానికి 2900 కోట్లు పెట్టిన మీరు అయోధ్యకు 11 కోట్లు పెట్టలేరా అని ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్‌కే చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రామ మందిరం వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇక్కడి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్‌లో రామాలయం నిర్మిస్తే మనమెందుకు విరాళాలు ఇవ్వాలని అన్నారు.

మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అని వ్యాఖ్యానించారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

తమకు కూడా భక్తి ఉందని.. తాము కూడా శ్రీరాముని భక్తులమే అని విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాలను సీఎం కేసీఆర్ సమానంగా చూస్తున్నారని తెలిపారు